Wednesday, 3 December 2025

 telugu poetry 
నిరాశ పడక, దురాశ లేక,
కృశించి పోని ప్రశస్తమైన,
సదాశయం తో తపస్సు చేసే
మహాశయుల దిశ లో
పరాశ్రయ భావన నశించి
కర్మ తపస్సు చేస్తున్నావా   
పొగడ్త పొగాకు లాగా హానికరం
రసోన్మత్తత ఉమ్మెత్త లాగా విషం
కానీ మనిషి కెందుకో మత్తంటే మక్కువ   
అందుకే అన్నీనిమిత్త మాత్ర మే అనుకో
మనిషి!

విపరీత వైవిధ్యం తో భూగ్రహంపై మాత్రమే కనిపించే

విచిత్ర ప్రవృత్తి గల వింత జీవి!! మనిషి!
 తిండి, గుడ్డ, యిల్లు ప్రాధమిక అవసరాలు
 కానీ వాటి కొరకు సాగించే పోరాటం మాత్రం  అనంతం
పరిశీలిస్తే అతనిలో అన్నీ  వైవిధ్య భరిత లక్షణాలే
గొప్పవిజ్ఞత, విపరీత  జిజ్ఞాస, ప్రేమ, కరుణ, ప్రశాంతత,   
తీవ్ర భావో ద్వేగంతో కూడిన  పశుత్వ, పిశాచ ప్రవర్తన
వింత ఆలోచనా తరంగాల మాయల మనసు
తన కేమి అవసరమో తెలుసుకొలేని బుద్ధి !
తనదైన ఆలోచనలతో నిర్మించుకున్న ప్రపంచం
ఊహలతో అల్లుకున్న లోకంలో పునాది లేని
యిసుక  మేడలు, కడుపు నింపని కార్ఖానాలు
దృఢమైన నమ్మకాల బంధిఖానాలు
నశించని మూఢత్వపు ముసుగులు,
అనైతిక వ్యాపారాలు,  మోజుల మెరుపులు,
విలాసాల పొరల విద్యాలయాలు !
కారణం  అహం!! అహం మనిషి చిహ్నం!!
దీని ఆకలికి బలైతే మనసు బుద్ధి మిగలవు    
 అది మథనమో! వ్యధో! శాసనమో! వినాశనమో!
ఎప్పుడూ ప్రశాంతత మాత్రమివ్వదు!   
అవగాహన సున్నాఅయితే  విచక్షణ భిన్నమే!
మోసం, దూషణ లే  భాష, ఘోష!
శరీరం లో విషం లేదు,కానీ బుద్ధి మాత్రం విషం
 కొమ్ములు, గోళ్ళు లేవు కానీ ఆలోచన అంతకన్నా వాడి
పెద్ద  విజ్ఞుడో, పండితుడోన్న ప్రగల్భాలు !కానీ
కొద్దిగా హేతుబద్దత, స్వీయావగాహన వున్నా
మదం మత్తు తో ఉన్మాదం; ఉన్మత్తతతో హింస!!
అందుకే నియంత్రించడం ఎన్నోసార్లు  అసాధ్యం
అయినప్పటికీ స్వీయసమగ్రత కోల్పోని స్థైర్యం !
దేవతలు  పిశాచాల సంకరమా,
విజ్ఞత మూర్ఖత్వాల సంతానమా! ఏమో! ఏమో!
వైవిధ్యం, పరిణామం  జాతుల లక్షణం
కానీ వైవిధ్యం వివక్షగా పరిణామం చెందడం వింత!  
ప్రేమ, అభిమానం, స్నేహం, భక్తి అనే ముసుగుల తో    
నిరాటంకంగా వివక్షతో కక్షలు, పరీక్షలు, వింత శిక్షలు!
కుక్షి కై పోరాటం , ఆకాంక్షల ఆరాటం లో
విజ్ఞానం వికాసం కొరకో, వినాశానికి వాడ్తున్నాడో!   
అధికార దాహం,  కీర్తి కుతి ; పరువుప్రతిష్టలు
ధన వ్యామోహం వంటి తాత్కాలిక సుఖాలకై  
మృత్యువుకు ఎదురు నిలవడానికి సిద్ధ పడే తత్వం
అహం గాయ పడితే పిరికి తనం కరుకుగామారి
ఎదురుతిరిగినపుడు  చంపడమో!  చావడమో!
స్వీయ పక్ష పాతే అయినా యితరుల నవమానిస్తూ
పూర్తిగా అన్యాయం గా వుండడం మనిషికే చెల్లింది
అధికారమిచ్చి మద్దతిస్తే ఆలోచనలు పూర్తిగా మారతాయి
అధికారానికి మోసానికి ఎదురు తిరిగితే, ఎవరినైనా
భయపెట్టో బెదిరించో అణగదొక్కడం
విధ్వంసం సృష్టించడం చేసే వాడు వీరుడా
మాన్యత లేక అనుమానం,న్యూనత తో అవమానం !
ఎంత గొప్పదనమో అంత నీచత్వం
ఎంత మొండితనమో అంతే చురుకుదనం
యే యిద్దరి ఆలోచనలు, అనుభూతులు, ఆకాంక్షలు
అభిప్రాయాలు ఒకటిగా లేకపోయినా సహనంతో
కలిసి వుండడం, అర్ధం లేని ఆవేశంతో ప్రవర్తించడం
ఆశ తో ప్రేరణ కలిగించడం ; దురాశతో రణం సృష్టించడం       
సమర్ధత లేక పోయినా ప్రతి వాడికి నిశ్శబ్దం గానో
పటాటోపంతోనో ప్రపంచం ఎలాలనే కాంక్షే!  
ఆవేశ కావేశాలున్న దుష్ట అసమర్ధ న్యాయ నిర్ణేతే
అయినా చేప నీళ్ళలో ఈదినట్లు సాగుతున్నాడు
వర్తమానం మరచి గతం తవ్వుకోవడం
భవిష్యత్తుకై చిత్తయిపోతున్నా ఎత్తులేయడం
విభిన్న రంగుల  సంకర ముఖంతో నవ్వే నరుడు  
మారే కాల మాన పరిస్థితులకు అనుగుణంగా మారగలగడమే
పరిణామ క్రమంలో మనిషిని విజేత జేశాయా?! అయినా
ప్రకృతి కన్నా బలహీనుడే!! ప్రకృతి లో భాగమే !
ప్రకృతి నియమాలను ఉల్లంఘించి ఎంత కాలం నిలబడ గలడు
భవిష్యత్తు లో ఎలా మార్తాడో! యెట్లుంటాడో!ఊహ కందట్లేదు!         
ఎన్ని గొప్ప గుణాలున్నాయో అనే  గర్వం!
యింత నీచత్వం వుందా  అనే భాద, భయం !
వీడొక విచిత్ర సంకర జీవి !!! వీడు మనిషా??!!!

శివోహం! 

 శివోహం! అంటే “నేను శివుడిని” అని అర్ధం!!

ఎందరో మహాను భావులు గొప్ప వ్యాఖ్యానాలు వ్రాసారు!!
But this is entirely different; just enjoy!   

మహా దేవా గళమున గరళము నిలిపినావట మరి   

మనిషి చిత్తము లో విషమేల చేరెనో!!!

వైద్యనాధుడవని ప్రతీతి పొందినావు

వైద్యం కొరకు నీ దగ్గరకు వస్తే విషం యిచ్ఛావా        

లేక నీ విబూది ధరిస్తే దాన్లోనుండి విషమొచ్చిందా!!

ఆది దేవుడే మింగాడంటే ఎంత మహిమాన్వితమో

అనుకుంటూ తాగే నీటిలో పీల్చే గాలిలో తినే తిండి లో 

కలుపుకొని, మరణం జయించే ప్రయత్నంలో

శివో హం  శివో హం శివో హం అనుకుంటున్నాం!!

అమృతం హరించిన రాహు కేతువులను

సంహరించ ప్రయత్నించిన దేవతలు

విషం తింటున్న మనిషిని ఎందుకు వదిలేశారు

విషమే గదా అన్ననిర్లక్ష్యమో!అవగాహనా రాహిత్యమో!

లేక, వీడెంత?? మనల్ని ఆశ్రయించి బతికే వాడనో!ఏమో!   

అమృతం లాగే విషానికి నశించే గుణం లేదు విస్తరించడమే

  

అమృతం నాకిన దేవతలు మాయమయ్యారు

శివుడి చేతిలో పరాభవం చెందిన  యముడు

నరకాన్ని నరలోకంలోకి మార్చిఆనందిస్తున్నాడు!  

విషం చేరిన మనుషుల్లో కొందరికి బుద్ధి వికసించిందో

మందగించిందో, కాపాడలేని వారి ఆశీస్సులేల ?

రకరకాల రూపాల్లోని దేవుళ్ళ కన్నా  

విషాన్ని భరిస్తున్న మేము విషం తిన్నవాడి కన్నా ఏం తక్కువ!!

అనుకొని తమను తాము దేవతా మూర్తులుగా ప్రచారం చేసుకునే

సంస్కృతి విస్తరించింది! శివో హం  శివో హం శివో హం!

 అమృతం మాకొద్దు గానీ  

ఈవిషాలన్నిహరించ గల ఔషదం మాత్రం కావాలి!!  

అప్పటి వరకు శివోహం  శివోహం అని తృప్తి చెందడమే!

 

No comments:

Post a Comment

 telugu poetry  నిరాశ పడక, దురాశ లేక, కృశించి పోని ప్రశస్తమైన, సదాశయం తో తపస్సు చేసే మహాశయుల దిశ లో పరాశ్రయ భావన నశించి కర్మ తపస్స...